షోడశ సంస్కారాలు
షోడశ సంస్కారాలు
సంస్కారములు హిందూ సాంప్రదాయము. ఇవి ప్రతి హిందువు యొక్క జీవిత పర్యంతమూ వివిధ దశలలో జరుపబడతాయి. స్త్రీ, పురుష సమాగమము మొదలుకొని, జననము, మరణము మరియు తదనంతరము ఆత్మ పరలోక శాంతి నొందుట వరకు సంస్కారములు జరపబడును.
సంస్కారములు మొత్తము పదహారు. వీనినే షోడశ సంస్కారములు అని కూడా వ్యవహరించెదరు. ఈ పదహారు సంస్కారములను తిరిగి రెండు విభాగముల క్రింద విభజించారు. అవి జనన పూర్వ సంస్కారములు (పుట్టుకకు ముందు), మరియు జననానంతర సంస్కారములు (పుట్టిన తరువాత). మొదటి మూడు సంస్కారములు జనన పూర్వ సంస్కారములు, ఆపై పదమూడు సంస్కారములు జననానంతర సంస్కారములు.
వ్యక్తి జీవితంలోని వివిధ దశల్లో జరిపే సంస్కారాలు:
1 గర్భాధానం 2 పుంసవనం 3 సీమంతం 4 జాతకర్మ 5 నామకరణం 6 నిష్క్రమణ 7 అన్నప్రాశన 8 చూడాకరణ
9 కర్ణవేధ 10 అక్షరాభ్యాసం 11 ఉపనయనం 12 వేదారంభం 13 కేశాంత 14 సమావర్తన 15 వివాహం 16 అంత్యేష్టి
సీమంతం అనే వేడుక గర్భాకాలమున ఆరవనెలన గాని, ఎనిమిదవ నెలనగాని జరుపవలెను (దేశకాలమానములు బట్టి ఇవి వేర్వేరుగా ఉండవచ్చును). ఇందులో మేడిపండ్లు, వనస్పతి మొదలగు శుభకరమైన పదార్థములను ఉపయోగించి భర్త భార్యను మేడిచెట్టువలె బలముగా నుండుమని, వనస్పతివలె సంతాన సంపదను పొందుమని అర్థం వచ్చే మంత్రములను వినిపించును. తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసేది. కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరక, మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. అందుకోసం ఆమె, ఆమె భర్త పాటించవలసిన నియమాలు ఈ సంస్కారంలో భాగంగా ఉన్నాయి.
గర్భిణీ స్త్రీ భర్త ఆమె కోరిక ఏమిటో తెలుసుకుని తీర్చడం. సీమంతం అంటే పాపిడి తీయడమని అర్థం. అంటే ఆ సమయంలో భర్త ఆమెను అంత అపురూపంగా చూసుకోవాలని అర్థం. అలాగే, ప్రజాపతి అదితికి సీమంతోన్నయనము చేసినట్లు నీకు కూడా సీమంతోన్నయనము చేసి, పుత్రపౌత్రాభివృద్ధి కలిగి, వృద్ధాప్యము వరకు దీర్ఘజీవిని చేసెదను అని ఇంకొక మంత్రము పలుకును. అటు తర్వాత భర్త దేవతలను ప్రార్థించి గర్భదోషములు తొలగింజేయు, భవిష్యత్త్ సంతాన కళ్యాణమునకై గర్భపోషణ చేసెడి నేతితో చరుపాక ప్రదర్శనము మొదలగు క్రియలను చేయును.
ఏ శుభకార్యాల్లో లేని విధంగా సీమంతం లో గాజులు తొడిగి పండంటి బిడ్డను ఇమ్మని ఆశీర్వదిస్తారు. అలా గాజులు ఎందుకు తొడుగుతారంటే గర్భం ధరించిన స్త్రీ గర్భకోశం మీద కావలసినంత జీవనాడుల ఒత్తిడి కావాలి. చేతుల్లో నరాలకీ, గర్భకోశానికి అవినాభావ సంబంధం ఉంది. అలా ఎక్కువ గాజులు తొడగడం వలన గర్భకోశం పై సరైన ఒత్తిడి వచ్చి సుఖప్రసవం జరుగుతుంది. కాబట్టి సీమంతమనగా మనము చేసుకునే వేడుక గాదు. తల్లి, అత్తగారు, భర్త, శ్రేయోభిలాషులతో సంతోషముగా, ముత్తైదువుల ఆశీర్వాదము పొందుట మంచిది.